దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాల్లో సంస్కరణలకు అంకురార్పణ చేస్తూ కేంద్రం ‘అగ్నిపథం’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేర్చుకునేవారికి కూడా ఘనమైన పేరే పెట్టారు. వారిని ‘అగ్నివీర్‌’లు అంటారు. ఇది నాలుగేళ్ల కాంట్రాక్టు. నియామకానికి సంబంధించిందే అయినా, మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారి సర్వీసు కొనసాగుతుంది. ఏటా నాలుగోవంతు మంది బయటకు రాకతప్పదు. వీరు నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేయొచ్చు. ఆ తర్వాత వారి పనితీరును సమీక్షిస్తారు. మొత్తం అగ్నివీరుల్లో 25 శాతం మందిని రిటెయిన్ చేస్తారు. అంటే ప్రతి 100 మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్లు 15 సంవత్సరాల పాటు నాన్ ఆఫీసర్ హోదాలో పని చేయవచ్చు.

అగ్నిపథ్‌ కింద సైన్యంలో చేరేవారికి మొదటి ఏడాది నెలకు 30 వేల రూపాయల జీతం ఇస్తారు. ఇందులో చేతికి 21 వేలు వస్తాయి. మిగిలిన 9 వేల రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమచేస్తారు. రెండో ఏడాది నెలకు 33 వేల రూపాయల జీతం వస్తుంది. అందులో 30 శాతం అంటే 9900 రూపాయలు కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. మూడో ఏడాదిలో ప్రతి నెలా ఇచ్చే 36,500లో 10,980 కార్పస్ ఫండ్‌లో జమ చేస్తారు. నాలుగో ఏడాది నెలకు 40 వేలు జీతం ఇస్తారు. ఇందులో 12,000 కార్పస్ ఫండ్‌కి వెళ్తుంది. ఇలా నాలుగేళ్లలో మొత్తం 5లక్షల రెండు వేల రూపాయలు కార్పస్‌ ఫండ్‌లో జమ అవుతాయి. దీనికి మరో 5 లక్షల 2 వేల రూపాయలు అదనంగా కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి వడ్డీ కలుపుకుని నాలుగేళ్ల తర్వాత 11.71 వేల రూపాయలు చెల్లిస్తారు. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఆర్మీ నిబంధనల ప్రకారం ఇతర రాయితీలు, సౌకర్యాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సమగ్ర ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది.

పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అగ్నిపథ్‌ పథకం ద్వారా సైన్యంలో చేరవచ్చు. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని నియమించుకుంటామని మొదట ప్రకటించినా, నిరుద్యోగుల ఆగ్రహంతో గరిష్ట వయస్సును 23 ఏళ్లకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. పదో తరగతి లేదా ఇంటర్ పాసైన యువతీ యువకులు అర్హులు. అయితే, ప్రస్తుతం అబ్బాయిలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. అనంతరం అమ్మాయిలకు కూడా ఈ అవకాశం ఇస్తామని చెబుతున్నారు. అర్హతలను బట్టి ఆర్మీ, వైమానిక దళం, నేవీలో పని చేయవచ్చు. సైన్యంలో ఉండగా ఎలా చనిపోయినా 48 లక్షల జీవిత బీమా ఉంటుంది. ఈ ఇన్సూరెన్స్ కోసం అభ్యర్థులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. విధి నిర్వహణలో చనిపోతే 44 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అదనంగా చెల్లిస్తారు. సైన్యంలో ఉండగా శారీరక వైకల్యం సంభవిస్తే పరిహారం అందిస్తారు. వైకల్యం 100 శాతం ఉంటే 44 లక్షలు, 75 శాతమైతే 25 లక్షలు, 50 శాతమైతే 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తారు.

ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటూ దేశ రక్షణ బలోపేతం అవుతుందని రక్షణమంత్రి అన్నారు. సైన్యంలో చేరాలన్న చాలామంది యువకుల కల సాకారమవుతుందని చెప్పారు. భారత సైన్యాన్ని మరింత యూత్‌ఫుల్‌గా, టెక్ సావీగా తీర్చిదిద్దడం కోసం యువత సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సైనికాధికారులు తెలిపారు. ఈ పథకం ప్రకటించి 24 గంటలు తిరగకుండానే దేశంలో ప‌లుచోట్ల‌ నిరసన జ్వాల‌లు ఎగిసిప‌డ్డాయి. నాలుగేళ్లు సైన్యాన్ని నమ్ముకుని పనిచేశాక మళ్లీ కొత్త కొలువు కోసం వేట మొదలుపెట్టాలా అన్నది వారి ప్రశ్న. అగ్నిపథ్ స్కీమ్ పట్ల సంతోషంగా లేని నిరుద్యోగులు అల్లర్లకు దిగుతున్నారు. ఆర్మీలో చేరడానికి తాము కొన్నేళ్లుగా కష్టపడుతున్నామని, కానీ నాలుగేళ్ల గడువుతో నియామకాలు చేపట్టడం తమకు అన్యాయం చేసినట్టవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట బీహార్‌లో మొదలైన నిరసన కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు పాకాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు.

నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందిని మాత్రమే సర్వీసులో కొనసాగిస్తారు. 75 శాతం మంది బయటకి రావాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్నట్టు వారందరికీ కొత్త ఉపాధి చూపడం సాధ్యమేనా? అక్కడ నేర్చుకున్న విద్యలతో, కొలువుపోయిందన్న అసంతృప్తితో పెడదోవ పట్టేవారుండరా? అసలు ‘అగ్నివీర్‌’లను సాధారణ సైనికుల మాదిరి పరిగణించి బాధ్యతలు అప్పగించడం ఆచరణలో అధికారులకు సాధ్యమేనా? అనుకోని పరిణామాలు వచ్చిపడితే ఇతర సైనికుల తరహాలో ‘అగ్నివీర్‌’లు పూర్తి సంసిద్ధత ప్రదర్శించగలరా? కేంద్రం జాగ్రత్తగా ఆలోచించి అడుగులేయాలి.

విరాట ప‌ర్వం రివ్యూ & రేటింగ్

By admin