గ‌ల్ఫ్ స‌మ‌స్య‌లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. ఇదే త‌రుణంలో కేరళ రాష్ట్రంలో ‘భారత్ జోడో యాత్ర’ సందర్బంగా పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గల్ఫ్ కార్మికుల సమస్యలను విన్నారు. సెప్టెంబర్ 27న జర్నలిస్ట్, మైగ్రేషన్ రైటర్, వలస కార్మికుల హక్కుల కార్యకర్త రెజిమోన్ కుట్టప్పన్ పాదయాత్రలో పాల్గొని రాహుల్ గాంధీతో 30 నిమిషాలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఈ ప్రత్యేక సమావేశానికి అపాయింట్మెంట్ ఇప్పించారు.

గల్ఫ్‌ దేశాలలో భారతీయ వలస కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను రెజిమోన్ వివరించారు. శ్రద్ధగా విన్న రాహుల్ కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. గల్ఫ్ వలసల విషయంపై ఢిల్లీలో ఫాలో-అప్ (తదుపరి) సమావేశానికి రాహుల్ హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో వలస కార్మికుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యం, పరిష్కార మార్గాలను వివరించడం జరిగింది. సౌదీ అరేబియా, కువైట్‌, ఓమాన్, యూఏఈ దేశాలకు ఇంటిపనికి వెళ్లే మహిళలు మానవ అక్రమ రవాణాకు గురవ్వడం, బానిసత్వంలో కూరుకుపోవడం, నిబంధనల ఉల్లంఘనల గురించి తెలపడం జరిగింది.

39 ఏళ్ల నాటి ఎమిగ్రేషన్ యాక్టు-1983 ను మానవతా కేంద్రీకృత (హ్యూమన్ సెంట్రిక్) గా ఆధునీకరిస్తే అంతర్జాతీయ వలస సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం గురించి రెజిమోన్ వివరించారు. కరోనా లాక్ డౌన్ సందర్బంగా గల్ఫ్ దేశాల నుంచి కార్మికులను వారి స్వదేశాలకు వెళ్లగొట్టినప్పుడు యాజమాన్యాలు జీతాలు, ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ ఎగవేసి ‘వేతన దొంగతనం’ (వేజ్ థెఫ్ట్) కు పాల్పడిన విషయం చర్చకు వచ్చింది. రక్షిత, సక్రమ, క్రమబద్ద వలసల కొరకు ప్రపంచ సంఘటిత ఒప్పందం (గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్, ఆర్డర్లీ అండ్ రెగ్యులర్ మైగ్రేషన్ – జిసిఎం) అమలు గురించి ప్రస్తావన వచ్చింది.

రెజిమోన్ కుట్టప్పన్ రాసిన ‘అన్ డాక్యుమెంటెడ్: స్టోరీస్ ఆఫ్ ఇండియన్ మైగ్రెంట్స్ ఇన్ ద అరబ్ గల్ఫ్’ అనే ఇంగ్లీష్ బుక్ ను రాహుల్ కు బహూకరించారు. అరబ్ గల్ఫ్ దేశాలలో డాక్యుమెంట్లు లేని (పాస్ పోర్ట్ లాంటి పత్రాలు లేని) ‘ఖల్లివెల్లి’ భారతీయ వలసదారుల కథల పుస్తకాన్ని రాహుల్ ఆసక్తిగా తిరగేశారు. ఈ పుస్తకం కావలసిన వారు అమెజాన్ లో ఈ లింక్ amzn.to/3dP6FwY ద్వారా ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు. కిండిల్ (ఆన్ లైన్) ఎడిషన్ లేదా ప్రింటెడ్ బుక్ పొందవచ్చు.

– మంద భీంరెడ్డి 98494 22622

By admin