● చెరుకు రైతుల చేదు బతుకులలో తియ్యదనం నింపే పోరాటం
● తడారిన ఎడారి జీవితాలకు భరోసానిస్తూ.. ఒయాసిస్సు వరకు తీసుకెళ్ళే పోరాటం 
● చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికుల బతుకమ్మ సాంస్కృతిక ఉద్యమం

ఉత్త‌ర తెలంగాణ‌లో వినూత్నమైన సాంస్కృతిక ఉద్యమం మొద‌లైంది. మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరువాలనే డిమాండ్ ఒకవైపు… గల్ఫ్ వలస కార్మికుల హక్కుల సాధన డిమాండ్ మరొకవైపు.. ఈ రెండు డిమాండ్లను కలిపి ఒక వినూతనమైన సాంస్కృతిక ఉద్యమానికి తేది: 25.09.2022 నాడు కొందరు ఉద్యమకారులు శ్రీకారం చుట్టారు. బతుకమ్మ కన్నా గొప్పదైన సందర్భం.. వేదిక ఇంకోటి లేదని ఈ ఏటి బతుకమ్మ సాక్షిగా వారు కార్యోన్ముఖులయ్యారు.

అన్నదమ్ముల తోడు లేని ఆడబిడ్డ బతుకమ్మ ఎలా వెలవెల బోతోందో.. ఒక చెల్లెలు గల్ఫ్ లో ఉన్న తన అన్నను సంబోదిస్తూ పాడే 14 నిమిషాల బతుకమ్మ పాటను ముత్యంపేటలో చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికులు, ఆడపడచుల సమక్షంలో విడుదల చేశారు.

కోరుట్ల నియోజక వర్గానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు సియస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు, గల్ఫ్ వలస కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న గల్ఫ్ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ ఇద్దరూ కలిసి.. తెలంగాణాలో మరో ఉద్యమానికి నాంది పలికారు. సీనియర్ జర్నలిస్ట్, అంతర్జాతీయ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి వీరికి తొడయ్యాడు.

తెలంగాణ ఉద్యమం.. బతుకమ్మ పండుగ.. గల్ఫ్‌ జిందగీ.. ఈ మూడింటికి కార్యకారక తెలంగాణ రాష్ట్ర సాధన సంబంధం ! దాన్ని గుర్తు చేసుకోవడానికి.. ప్రభుత్వాల బాధ్యతను గుర్తుచేయడానికి బతుకమ్మ పండగే అసలైన సందర్భం అని సామాజిక ఉద్యమకారులు నిర్ణయించారు.

తెలంగాణ సాధన లక్ష్యం ఏంటి? ఆ మాటకొస్తే అసలు ఆ పోరాటానికి కారణం ఏంటి? మన నీళ్లు.. మన నిధులు.. మన నియామకాలు ఆంధ్రప్రాంతం సొత్తవుతున్నాయనే కదా! తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు పారుతయ్‌.. మన పంట భూమి విస్తీర్ణం పెరుగుతది.. మన నిధులు మనకు అంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మూత పడిన పరిశ్రమలను మళ్లీ తెరుస్తరు.. వాటితోపాటు నాలుగు కొత్త పరిశ్రమలనూ నెలకొల్పుతారు.. దాంతోటి కొత్త కొలువులు వస్తయ్‌.. ఉన్న కొలువుల్లోనూ మనవాళ్లు భర్తీ అవుతారు అనే కదా!

ఇంత జరిగితే గల్ఫ్‌ వలసలు ఆగుతాయ్‌. దేశం కాని దేశంలో.. అయినవాళ్లకు దూరంగా.. వెళ్లదీస్తే జీవితాలు సొంత తీరానికి చేరుతాయి. సొంత జాగలల్ల అయిన వాళ్ల మధ్య.. కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్రకైనా నోచుకుంటమనే కదా.. తెలంగాణ ఉద్యమంలో గల్ఫ్‌ వలస కూడా గొంతు కలిపింది!

ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో.. ఇదే బతుకమ్మ ఓ నినాదమై ఉద్యమాన్ని ముందుకు నడిపింది. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి నినాదంతో వలస కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

కానీ తెలంగాణ వచ్చాక ఏమైంది? ఎన్ని బతుకమ్మ పండుగలు పాయే? హామీలు జమ్మి చెట్టెక్కాయి. దాన్ని దింపి గల్ఫ్‌ వలస కుటుంబాల జీవితాల్లో బంగారాలను నింపే బాధ్యతను ప్రభుత్బానికి గుర్తు చేయడానికి గల్ఫ్ జెఏసి పూనుకున్నది. గల్ఫ్‌ వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణలో జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీకి దిక్కు లేకపాయే! కనీసం ఆ ఫ్యాక్టరీ తెరుస్తేనైనా.. కొన్ని జీవితాల్లోనైనా చేదు తగ్గుతుంది.  సోయి లేని ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేయడానికి బతుకమ్మ పండుగ ఒక మంచి సందర్భం.

కొందరు తెలంగాణ నాయకులు దుబాయికి లోని బుర్జ్‌ ఖలీఫా వద్ద లేజర్ షోలు నిర్వహించారు. అంతకుముందు గల్ఫ్ దేశాల్లో బతుకమ్మ పండుగను ఒక అవకాశంగా వాడుకున్నారు.

ప్రపంచంలో ఎత్తయిన భవనం దుబాయిలోని బుర్జ్  ఖలీఫా నమూనాతో.. ముత్యంపేటలో బతుకమ్మ సంబరాలను ప్రారంభించిన చెన్నమనేని శ్రీనివాస రావు స్పూర్తితో.. ఈ సాంస్కృతిక ఉద్యమం ఉత్తర తెలంగాణ లోని గల్ఫ్ ప్రభావిత 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో వ్యాపింపజేయడానికి మా వంతు కృషి చేస్తాము. ఈ ఉద్యమం బుర్జ్ ఖలీఫా లాగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగి.. గల్ఫ్ బోర్డు సాధనతో లక్ష్యాన్ని ముద్దాడుతామనే విశ్వాసం ఉంది.

“మీ జీవితంలో ప్రతిదీ రాజకీయమే నిర్ణయిస్తున్నప్పుడు, మీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి” అనే కొటేషన్ గుర్తుకొస్తున్నది.

ఇట్లు: తోట ధర్మేందర్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ 

 

Breaking News APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
GamechanZer
www.gamechanzer.com

#GameChanzer

 

By admin