విదేశాల్లో ఉన్న ఎన్నారైలు ఫారం 6-ఎ నింపి స్వగ్రామంలో ‘ఓవర్సీస్ ఎలక్టర్’ గా ఓటరు లిస్టులో తమ పేరు నమోదు చేసుకోవచ్చు.

https://ecisveep.nic.in/voters/overseas-voters/

2010 లో సవరించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 20-ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారతదేశంలో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఎన్నారైలు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్ పోర్ట్ లో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత శాసనసభ నియోజకవర్గం ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం 6-ఎ లో తమ దరఖాస్తులను సమర్పించాలి. ఓటర్ల జాబితా చివరన “ఓవర్సీస్ ఎలక్టర్స్” గా ప్రత్యేక పేజీలు ఏర్పాటు చేస్తారు.

స్వయంగా, పోస్ట్ ద్వారా లేదా  http://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GB  ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కలర్ ఫోటో, స్వయంగా ధ్రువీకరించిన (సెల్ఫ్ అటెస్టెడ్) పాస్ పోర్ట్, వీసా పేజీ కాపీలను జతచేయాలి / అప్ లోడ్ చేయాలి. స్వయంగా దరఖాస్తు చేసిన సందర్భంలో అధికారికి ఒరిజినల్ పాస్ పోర్ట్ చూపించాలి.

దరఖాస్తు చేసిన తర్వాత భారత దేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఏడు రోజుల వరకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశం లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. విదేశాల్లో 1 కోటి 26 లక్షల ఎన్నారైలు ఉండగా.. 1 లక్షా 12  వేల మంది మాత్రమే ఓవర్సీస్ ఎలక్టర్స్ గా రిజిస్టర్ అయినారు. వీరిలో  అత్యధికులు కేరళ ప్రవాసులు. ఎన్నారైలు ఓటర్లుగా నమోదు చేసుకుంటేనే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

స్వయంగా వచ్చి ఓటేయాలి
“ఓవర్సేస్ ఎలక్టర్స్” (ఎన్నారై ఓటర్లు) గా నమోదు అయినవారు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్ కు స్వయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వీరికి ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయరు కాబట్టి, ఒరిజినల్ పాస్ పోర్ట్ చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి.  వీరికి ఎన్నికలలో పోటీ చేసే హక్కుతో పాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులు సమానంగా ఉంటాయి.

మరిన్ని వివరాలకు కేంద్ర ఎన్నికల సంఘం http://eci.nic.in వెబ్ సైటు లేదా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం http://ceotelangana.nic.in/ వెబ్ సైటు ను సందర్శించవచ్చు.

– సింగిరెడ్డి నరేష్ రెడ్డి,
గల్ఫ్ కన్వీనర్,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి),
ఎన్నారై సెల్ – ప్రవాస భారతీయుల విభాగం

By admin