* అఖిల పక్ష సమావేశంలో ముక్తకంఠంతో నేతల డిమాండ్
* కృష్ణారెడ్డి ని తక్షణమే అరెస్ట్ చేయాలి: మధుయాష్కి
* కేసీఆర్ సర్కార్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: కోదండరాం
హైదరాబాద్ (mediaboss network) :
“కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. నాసిరకం నిర్మాణానికి భాద్యులైన మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవితవ్యంపై ఇంజనీరింగ్ నిపుణులు, తెలంగాణ బుద్దిజీవులతో లోతైన సమీక్ష చేపట్టాలి.” అని తెలంగాణ అఖిల పక్షాలు, ఉద్యమ సంస్థలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(TJF) అధ్యక్షుడు పల్లె రవి కుమార్ అధ్యక్షతన తెలంగాణ ఇంజనీర్స్ ఫోరమ్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్.. ప్రజోపయోగమా? రూ. లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగమా? వాస్తవాలు – వక్రీకరణలు’ అనే అంశంపై, సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిల పక్ష నేతలు, ఇంజనీర్లు, సీనియర్ జర్నలిస్ట్ లు, ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ ఇంజనీర్స్ ఫోరమ్ అధ్యక్షుడు దొంతుల లక్ష్మినారాయణ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మాట్లాడుతూ.. “రూ. లక్ష 20 వేల కోట్ల ప్రజాధనంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో నాసిరకం పనులు చేసిన కాంట్రక్టర్ కృష్ణారెడ్డి ని తక్షణమే అరెస్ట్ చేయాలి. తెలంగాణకు అన్యాయానికి గురవుతుందని ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకుంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారు. ఈ 8 ఏళ్లలో సాధించింది
ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే. కేసీఆర్ తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు. ఇదే జరిగిన అభివృద్ధి. కేసీఆర్ పథకాలు అడుక్కు తినేలా ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం.”
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్ సర్కార్ పాలన తీరుపై మండిపడ్డారు. అధికారం ఆస్తులను పెంచుకుంటే కాళేశ్వరం అవుతుందని అన్నారు. ఈ సారి చాలా గ్రామాలు ముంపునకు గురవడం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు నిర్మాణమే కారణమని దుయ్యబట్టరు. తప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం కాకుండా ఆస్తులు పెంచుకోవడం కోసమే పని చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ.. “ఎవరు అవినీతి చేసిన బీజేపీ ప్రభుత్వం వదిలి పెట్టదు. కాళేశ్వరంలో అవినీతి అక్రమాలపై కేంద్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కాళేశ్వరం ముంపుపైన ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్షించాలి”.
బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానంద రావు మాట్లాడుతూ... “కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నాణ్యత లేని నిర్మాణలు చేసిన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి.” కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలి.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అవినీతికి కారణమైన సీఎం కేసీఆర్ ను వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సీబీఐ విచారణ జరిపించాలి.
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ…
సీఎం కేసీఆర్ తో పాటు ఇంజనీర్స్, కాంట్రాక్టర్లు కూడా దోచుకుంటున్నారు. పార్టీలన్నీ మౌనం పాటిస్తున్నాయి. కేసీఆర్ ప్రాజెక్టులన్నీ ప్రజలను మోసం చేశావే.
ఈ సందర్బంగా సమావేశం పలు తీర్మానాలు చేసింది.
1. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో, రీ డిజైన్ లో జరిగిన తప్పిదాల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలు కూలటం, నీళ్లు పంపులను మొత్తం ముంచేశాయి.దీనికి తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత. నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో బాధ్యులైన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
2. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యాలపై, అవినీతిపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
3. గోదావరి, కృష్ణా నదులను వాటిపై నిర్మాణాలను తన చేతిలోకి తీసుకుంటూ చట్టవ్యతిరేకoగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను వెంటనే ఉపసంహరించాలి.
4. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, నీతి ఆయోగ్ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంశించారు. మరోవైపు పార్లమెంటులో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమన్నారు.ఈ ద్వంద్వ వైఖరిని రౌండ్ టేబుల్ సమావేశం నిరసించింది. ఇది తెలంగాణకు అన్యాయం కాదా అని ప్రశ్నించారు.
5. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని, ఆదివాసీల ముంపు నివారించాలని, ఆంద్రప్రదేశ్ లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలోకి మార్చాలని సమావేశం డిమాండ్ చేసింది.
6. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, నిపుణులు, మొత్తంగా తెలంగాణ పౌర సమాజం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యాలను, అవినీతిని ప్రత్యేకంగా పరిశీలించాలని, నిజాలను సమాజానికి వివరించాలని సమావేశం డిమాండ్ చేసింది.
అ సందర్బంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవి కుమార్ మాట్లాడుతూ.. ఎవరు తెలంగాణ పట్ల ప్రేమతో ఉన్నారో అలాంటి వారు, నిపుణులైన ఇంజనీర్స్ తో ఒక నిజానిర్దారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఇది ఇంతటితో ఆపేస్తే ఇక్కడితో ఆగిపోదు, మళ్ళీ రికరింగ్ పేరుతో భారీగా డబ్బులు ఖర్చు చేస్తారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద తప్పు జరిగిందని, ఆ తప్పును ఇప్పుడు ఎలా సరిదిద్దలో ఆలోచించాలన్నారు. ప్రభుత్వం బేషజాలకు వెళ్లకుండా అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అయిన తప్పును మళ్ళీ జరగకుండా చూసే బాధ్యత మన పైన ఉంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏపూరు సోమన్న, ఉద్యమ నాయకులు డాక్టర్ పృథ్విరాజ్, కత్తి వెంకటస్వామి, జయసారధి రెడ్డి, భగవాన్ రెడ్డి, తెలంగాణ విఠల్,ఇంజనీర్ విఠల్ రావు, తెలంగాణ సోషల్ మీడియా ఫోరమ్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ నాయకులు మేకల కృష్ణ, పాలకూరి రాజు, పోగుల ప్రకాష్, ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి, స్వామి ముద్దం తదితరులు పాల్గొన్నారు.