◉ బుర్జ్ ఖలీఫా నమూనాపై చెరుకుగడలు, గల్ఫ్ జెఏసి జెండాతో బతుకమ్మ

హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):
కోటి ఆరాటాలు ఒక‌టైతే, బ‌తుకు పోరాటం అంతెత్తుకు ఎగుస్తది. గ‌ల్ఫ్ బాధితుల గుండె చ‌ప్పుడు ఆకాశ‌మంతా ధ్వ‌నిస్తోంది. ఇదుగో చూడు అంటూ త‌మ గోస‌ను మ‌ళ్లీమ‌ళ్లీ పాల‌కుల‌కు గ‌ట్టిగా వినిపిస్తున్నారు గ‌ల్ఫ్ బాధితులు. ఈ క్ర‌మంలో బ‌తుక‌మ్మ పండుగ‌లో కోటి చ‌ప్పట్లు ఒక‌టై మారుమోగినై.

2021 అక్టోబర్ 23 @ బుర్జ్ ఖ‌లీఫా (దుబాయ్)
ఒక ఎంపీ, ఆరుగురు ఎమ్మెల్యేల సమక్షంలో.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో దుబాయిలోని బుర్జ్ ఖలీఫా వద్ద కోటి రూపాయలు ఖర్చు చేసి ఎడారి ఆకాశంలో బతుకమ్మ సంబరాల లేజర్ షో నిర్వహించారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద భ‌వ‌నం బుర్జ్ ఖలీఫా స్క్రీన్ (తెర) పై లేజర్ షో ద్వారా బతుకమ్మ దృశ్య నివేదన జరిగింది. ఆకాశంలో పూల పండుగ చూసి ప్రపంచం అబ్బుర పడింది.

2022 అక్టోబర్ 08 @ బీమారం, చిన‌మెటుపల్లి (ఉత్త‌ర తెలంగాణ‌)
దుబాయి బతుకమ్మకు పోటీగా ఈ సంవత్సరం తెలంగాణ గడ్డపై ‘కోటి చప్పట్ల బతుకమ్మ’ నిర్వహించారు.
గల్ఫ్ దేశాలలో ఉన్న 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు, గల్ఫ్ నుంచి తిరిగి వచ్చి గ్రామాలలో స్థిరపడ్డ 30 లక్షల మంది కార్మికులు, వీరందరి కుటుంబ సభ్యులు కలిసి ‘ఒక కోటి గల్ఫ్ ఓటు బ్యాంకు’ ఏర్పడిందని బీమారం గ్రామానికి చెందిన గల్ఫ్ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల ర‌విగౌడ్ తెలిపారు. తమ ఉద్యమం కోటి చప్పట్లుగా… కోటి ఓట్లు గా వర్ధిల్లుతుందని రవిగౌడ్ అన్నారు.

జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం బీమారం, కోరుట్ల మండలం చిన్న మెటుపల్లి గ్రామాలలో శనివారం రాత్రి మహిళలు వినూత్నమైన రీతిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఉత్తర తెలంగాణలోని వందలాది గ్రామాలలో దసరా తర్వాత సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకునే ఆచారం ఉన్నది. దుబాయిలోని ప్రపంచంలోనే ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా నమూనాను తయారు చేసి దాని శిఖరంపై చెరుకుగడల ఆకులు, గల్ఫ్ జెఏసి జెండా నిలిపి దాని చుట్టూ మహిళలు బతుకమ్మ ఆడారు. చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికుల కుటుంబాల మహిళలతో గ్రామంలోని ఆడపడుచులు అందరూ ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ తెరిపించేలా.. ‘గల్ఫ్ బోర్డు’ ఏర్పాటు అయ్యేలా దీవించాలని బతుకమ్మను వేడుకుంటూ పాటలు పాడారు.

తెలంగాణలో ఉన్న ఒక చెల్లెలు… గల్ఫ్ లో ఉన్న తన అన్నను సంబోధిస్తూ పాడిన బతుకమ్మ పాటలోని కొన్ని చరణాలు.

వీడియోకాల్ లో ఉయ్యాలో…
ఆట చూత్తావానే ఉయ్యాలో…

ఆడియోకాల్ లో ఉయ్యాలో…
పాట వింటవానే ఉయ్యాలో…

ముత్యంపేటా సెరుకు ఉయ్యాలో…
మూగబోయినాదే ఉయ్యాల…

ఫాక్టరీ తెరవాలె ఉయ్యాల…
ఈ వలసలూ ఆగాలె ఉయ్యాల…

గల్ఫ్ దేశాలు మానాలె ఉయ్యాల…
ఇగ ఎవుసాలు సెయ్యాలె ఉయ్యాల…

బతుకమ్మ సాంస్కృతిక ఉద్యమం ఉత్తర తెలంగాణ లోని గల్ఫ్ ప్రభావిత 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో వ్యాపించింది. ఉద్యమం బుర్జ్ ఖలీఫా లాగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగి.. చెరుకు ఫ్యాక్టరీ, గల్ఫ్ బోర్డు సాధనతో లక్ష్యాన్ని చేరుకుంటామనే విశ్వాసం ఉందని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. “మీ జీవితంలో ప్రతిదీ రాజకీయమే నిర్ణయిస్తున్నప్పుడు, మీ భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి” అనే కొటేషన్ మాకు గుర్తుకొస్తున్నదని ఆయన అన్నారు.

ముత్యంపేట ఫ్యాక్టరీ తెరిస్తే వలసలు తగ్గుతాయి
సెప్టెంబర్ 25న బతుకమ్మ మొదటి రోజు బుర్జ్ ఖలీఫా నమూనాను ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ గేటు ముందు ప్రతిష్టించి మహిళలు బతుకమ్మ ఆడి ఒక వినూత్నమైన సాంస్కృతిక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరవాలని, గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి ‘గల్ఫ్ బోర్డు’ ను ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తూ బతుకమ్మ ఆడారు. సిఎస్ఆర్ ఫౌండేషన్ వారు రూపొందించిన బతుకమ్మ పాటను ఈ సందర్బంగా చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికులు, ఆడపడచుల సమక్షంలో విడుదల చేశారు.

కోరుట్ల నియోజక వర్గానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు, గల్ఫ్ వలస కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న గల్ఫ్ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ ఇద్దరూ కలిసి.. తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది పలికారు. అంతర్జాతీయ వలస వ్యవహారాల విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మంద భీంరెడ్డి మార్గదర్శనం వీరికి ఉపయోగపడింది. నాలుగో రోజు మొగిలిపేటలో జరిగిన భారీ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజా గాయకుడు గద్దర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత మన్నెగూడెం, సిర్పూర్ తదితర గ్రామాల్లో బుర్జ్ ఖలీఫాతో బతుకమ్మ నిర్వహించారు.

తిరగబడ్డ ఎనిమిదో సెగ్మెంట్
2015 జూన్ లో బహ్రెయిన్ లో కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసిన సందర్భంలో ఆనాడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత ‘గల్ఫ్ నా ఎనిమిదో సెగ్మెంట్’ అని వ్యాఖ్యానించారు. ఒక అంచనా ప్రకారం… భారత దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అత్యధిక గల్ఫ్ వలస కార్మికులు ఉన్న నియోజకవర్గం నిజామాబాద్. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తన ఎనిమిదవ సెగ్మెంట్ గల్ఫ్ అని కవిత ఆనాడు ప్రేమగా చెప్పుకున్నారు.

తరువాతి కాలంలో తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతో… తమ బతుకులకు భరోసా ఇవ్వనందుకు చిన్నబుచ్చుకున్న గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తమ కోపాన్ని చూపించారు. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పరాజయం పాలయ్యారు. ఒయాసిస్సు లా ఉన్న ఆమె రాజకీయ జీవితం ఎండమావి గా మారడానికి గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం చూపించింది. లోక్ సభ ఎన్నికల్లో ఓడించిన ఎనిమిదో సెగ్మెంట్ ‘గల్ఫ్’ పై కోపం పెట్టుకోకుండా కవిత పాజిటివ్ గా, స్పోర్టివ్ గా వ్యవహరించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తే బాగుంటుంది.

గత సంవత్సరం దుబాయి లోని బుర్జ్ ఖలీఫాపై కల్వకుంట్ల కవిత నిర్వహించిన ఖరీదైన కార్పొరేట్ బతుకమ్మ సంబరాలకు ధీటుగా ఈ సంవత్సరం ఉద్యమకారులు తెలంగాణ గడ్డపై గరీబు గల్ఫ్ కార్మికుల కుటుంబాలతో బుర్జ్ ఖలీఫా నమూనాతో బతుకమ్మ సంబరాలు నిర్వహించి గల్ఫ్ కార్మికులకు భరోసా కల్పించారు.

ప్రపంచంలోనే ఎత్తయిన కట్టడం, ఆకాశహర్మ్యం దుబాయి లోని బుర్జ్ ఖలీఫా. దీని నిర్మాణంలో భారత్ తో సహా ఆసియా దేశాల కార్మికులు, మన తెలంగాణ కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయి. నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది? తాజమహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు? అనే మాటలు గుర్తుకు వస్తున్నాయి.

గల్ఫ్ పునాదులు మనవారి చెమటతో తడిశాయి
గల్ఫ్ దేశాలలోని రంగు రంగుల ఆకాశ భవనాల నిర్మాణం వెనుక మన తెలంగాణ కార్మికుల కష్టం ఉన్నది. ఈ నిర్మాణాల పునాదులు మన కార్మికుల చెమటతో తడిశాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో గల్ఫ్ ప్రవాసుల పాత్ర అమోఘం. గుర్తింపుకు నోచుకోని అజ్ఞాత వీరులు, అజ్ఞాత శిల్పులైన మన ప్రవాసీ కూలీలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.

తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ముఖ్యమైనది. బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి అనే నినాదంతో వలస కార్మికులు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ సాధనలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల పాత్ర మరువలేనిది. తెలంగాణ ఏర్పడిన 2 జూన్ 2014 నుంచి ఈనాటి వరకు గత ఎనిమిది ఏళ్లలో గల్ఫ్ దేశాలలో సుమారు 1,600 కు పైగా తెలంగాణ కార్మికులు మరణించారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వారు 2,000 కు పైగా మరణించారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానన్న కేసీఆర్ హామీని అమలు చేయడానికి కవిత కృషి చేస్తారని ఆశిద్దాం. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రభుత్వం ప్రకటించాలని తెలంగాణ ప్రవాసీయులు కోరుకుంటున్నారు.

– వ్యాస‌క‌ర్త‌: మంద భీంరెడ్డి, 98494 22622666

 

ఉత్త‌ర తెలంగాణ‌లో వినూత్నమైన సాంస్కృతిక ఉద్యమం

 

Breaking News APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

 

 

GamechanZer
www.gamechanzer.com

#GameChanzer

 

 

 

By admin