సినిమా: మసూద
నిర్మాణ సంస్థ: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మంఎట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
నటీనటులు: సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌, శుభలేఖ సుధాకర్‌, సత్యప్రకాష్‌, సత్యం రాజేష్‌ తదితరులు
నిర్మాత: రాహుల్‌ యాదవ్‌ నక్కా
దర్శకత్వం: సాయికిరణ్‌
కెమెరా: నగేష్‌
ఆర్ట్: క్రాంతి ప్రియమ్‌
ఎడిటర్‌: జెస్విన్‌ ఫ్రభు
సౌండ్‌ డిజైన్‌: సింక్‌ సినిమా
స్టంట్స్: రామ్‌ క్రిష్ణన్‌, స్టంట్‌ జాషువా
సంగీతం: ప్రశాంత్‌.ఆర్‌.విహారి

ఇటీవ‌ల టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారి తాజాగా విడుద‌లైంది ‘మసూద’. మళ్లీరాజా, ఏజెంట్‌ సాయిశ్రీనివాస్‌ ఆత్రేయ సినిమాలను తెరకెక్కించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మీద కూడా ఎప్పుడూ ఓ నజర్‌ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యానర్‌ నుంచి వచ్చిన మూవీ మసూద. ఈ సినిమా ఎలా ఉంది? జనాలకు నచ్చుతుందా? మసూద కథ ఏంటి? అసలు మసూద ఎవరు? అడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పింస్తుందో ఇవాల్టీ రివ్యూ రిపోర్ట్‌లో తెలుసుకుందాం.

క‌థ‌
నీలం (సంగీత) తన భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్‌)కు దూరంగా ఉంటూ తన కూతురు నాజియా(బాంధవి శ్రీధ‌ర్)ను పెంచుకుంటూ ఉంటుంది. నీలం పక్కింట్లోనే ఉండే గోపీ (తీరువీర్) కాస్త భయస్థుడు. గోపీ తన సహోద్యోగి మినీ (కావ్యా కళ్యాణ్‌ రామ్)ను ప్రేమిస్తుంటాడు. నీలంకు గోపీ చేదోడువాదోడుగా ఉంటాడు. అలాంటి సమయంలో నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు గోపీ. దెయ్యం పట్టి ఉంటుందన్న అనుమానంతో ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈక్రమంలో గోపికి ఎదురైన ఘటనలు ఏంటి? మినీతో ప్రేమ వ్యవహారం ఏమవుతుంది?నీలం తన కూతురిని రక్షించుకుంటుందా? నాజియాకు దెయ్యం ఎందుకు పట్టింది? అసలు మసూద ఎవరు? మసూద నేపథ్యం ఏంటి? చివరకు గోపి ఏం చేశాడు? అనే వాటికి స‌మాధాన‌మే ఈ సినిమా.

నటీనటులు
మసూద కథలో గోపి పాత్ర కీల‌కం. ఆ పాత్రకు తిరువీర్ చక్కగా కుదిరాడు. ఇది వరకు తిరువీర్ అంటే విలనిజం గుర్తుకు వచ్చేది. కానీ ఇందులో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించాడు. భయస్తుడు, మొహమాటస్తుడిగా చాలాబాగా నటించాడు. ఇక సంగీత అయితే తన సీనియారిటీని చూపించింది. ఎమోషనల్ సీన్స్‌లో కన్నీరు పెట్టించేసింది. కావ్యా కళ్యాణ్‌ రామ్‌ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేనట్టుగా అనిపిస్తుంది. కానీ కనిపించినంత సేపు అందంగా అనిపిస్తుంది. ఇక నాజియా పాత్రలో నటించి బాంధవి మాత్రం నిజంగానే భయపెట్టేసింది. ఈ సినిమా అంతా కూడా ఆమె చుట్టూనే నడిచింది. మసూద పాత్ర హైలెట్ అయినా ఆ కారెక్టర్‌లో ఎవరు నటించారన్నది సరిగ్గా చూపించలేదు. సీక్వెల్ కోసం దాచినట్టుగా అనిపిస్తుంది. మిగిలిన పాత్రల్లో సత్యం రాజేష్‌, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్‌ వంటి వారు చక్కగా నటించారు. ఈ కథలో పీర్ బాబా (శుభలేఖ సుధాకర్), అల్లాఉద్దీన్ (సత్యం రాజేష్‌) పాత్రలు ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి.

విశ్లేష‌ణ‌
సినిమా చూసే క్ర‌మంలో చిన్న త్రెడ్‌ లీక్‌ అయినా సినిమా చూసే ప్రేక్షకులు థ్రిల్‌ మిస్‌ అయ్యే అవ‌కాశం ఉంటుంది. స్కూలు టీచర్‌ కేరక్టర్‌లో, సింగిల్‌ మదర్‌గా, కాటన్‌ చీరలు కట్టుకుని చాలా బాగా యాక్ట్ చేశారు సంగీత. స్ట్రాంగ్‌ విమెన్‌గా ఆమె కేరక్టర్‌కి న్యాయం చేశారు. నజియా కేరక్టర్‌ చేసిన అమ్మాయి నేచురల్‌గా పెర్ఫార్మ్ చేసింది. గోపీలాంటి పాత్రలు మనకు నిజజీవితంలోనూ చాలా ఎదురుపడుతుంటాయి. కావాల్సినంత మాట్లాడటం, అవతలివారికి వీలైనంత సాయం చేయడం, తన పని తాను చేసుకుపోవడం.. ఇలాంటి కేరక్టరిస్టిక్స్ తో చాలా మంది రిలేట్‌ అవుతారు. మిని లాంటి అమ్మాయిలు మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటారు. పనిచేసే చోట జీతాలు సరిగా ఇవ్వకపోతే, ఆ జీతాల మీద ఆధారపడ్డ కుటుంబాలు ఎదుర్కునే పరిస్థితులు… గౌరవంగా బతుకుతున్న సొసైటీని ప్రతిరోజూ ఫేస్‌ చేయలేక పడే పాట్లను కూడా సెన్సిటివ్‌గా చూపించారు. మామూలుగా మసూద అని టైటిల్‌ పెట్టినప్పుడు, టైటిల్‌ పాత్రధారిని పాజిటివ్‌ కోణంలో చూపించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ సినిమాలో మసూదది నెగటివ్‌ కేరక్టర్‌. దాన్ని కూడా చాలా అందంగా మలచి, అందరికీ కన్విన్సింగ్‌గా చెప్ప‌డంలో డైరక్టర్ స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. ఎక్కడా బోర్‌ కొట్టకుండా, జాగ్రత్తగా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. సింక్‌ సౌండ్‌ని స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిందే. నేపథ్య సంగీతం సినిమాకు అత్యంత పెద్ద ప్లస్‌ పాయింట్‌. కెమెరాపనితనం, ఆర్ట్ వర్క్ కూడా బావుంది. సినిమాను ఇంకాస్త క్రిస్పీగా ఎడిట్‌ చేసి ఉంటే బావుండేది. డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాత సైతం సినిమాకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. మసూద సినిమా అక్కడక్కడా కాస్త స్లోగా అనిపించినా కూడా భయపెట్టడంతో మాత్రం సక్సెస్ అయింది.

సాటి మనిషికి సాయం చేయాలంటే వారితో ఏదో రిలేషన్‌ ఉండక్కర్లేదని చెప్పే సినిమా మసూద. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. ఫైన‌ల్‌గా సినీ ప్రేమికుల‌కు ఈ సినిమా న‌చ్చుతుంద‌నే చెప్పాలి.

రేటింగ్ 3.5 / 5

By admin