మెటావర్స్ యుగం ప్రారంభమవుతోంది. అప్‌కమింగ్ టెక్నాలజీ అప్పుడే అందిపుచ్చుకుంటూ, వర్చువల్ ప్రపంచంలో దూసుకుపోతూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖులు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ తన అవతారంతో మెటావర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. కేటీఆర్ అవతార్ రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ అగ్రగామిగా నిలిచే లక్ష్యంతో విధాన ప్రకటన చేసింది. స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్ 2022ను ప్రకటించింది. సాధారణ కార్యక్రమంలా కాకుండా మెటావర్స్ విధానంలో పూర్తిగా వర్చువల్ పద్ధతిలో ప్రకటన కార్యక్రమం జరిగింది. ఐటీ శాఖా మంత్రి కేటీఆ, నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, ఇన్ స్పేస్ ఛైర్ పర్సన్ పవన్ గోయెంకా, తదితరులు వర్చువల్ విధానంలో తమ అవతార్‌లతో పాల్గొన్నారు. వారి రూపాలను మెటావర్స్ విధానంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తెలంగాణ విధానాలు, స్పేస్‌టెక్ ఫ్రేమ్ వర్క్‌ను వారు అభినందించారు. స్పేస్ టెక్ తమ ప్రభుత్వ తదుపరి ప్రాధాన్య రంగమని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2026 నాటికి అంతరిక్ష పరిశ్రమ 558 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న కేటీఆర్.. అందులో మెజార్టీ వాటా అందిపుచ్చుకోవాలని అభిలషించారు. స్పేస్ టెక్ ఎన్ఎఫ్టీ విక్రయాలను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్పేస్ టెక్‌లో తెలంగాణ ముందడుగు వేయడం సంతోషకరమని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. తొలిసారిగా ప్రభుత్వ కార్యక్రమాన్ని మెటావర్స్ విధానంలో నిర్వహించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.