ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నేత ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముర్ము పేరును అధికారికంగా ప్రకటించారు. ఆదివాసీ మహిళ అయిన ముర్ము 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌ అయిన ముర్ము 2000-04 మధ్యలో ఒడిశా రవాణా, ఫిషరీస్‌ శాఖల మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ముర్ము టీచర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు.

1958, జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైడపోసిలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గా పనిచేశారు. 2000 నుంచి 2004 వరకు ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుంచి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణా శాఖకు స్వతంత్ర రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. ఆమె తన రాజకీయ జీవితాన్ని కౌన్సిలర్‌గా ప్రారంభించి, తరువాత రాయంగ్‌పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా NAC వైస్-ఛైర్‌పర్సన్‌ అయ్యారు. 2013లో ఆమె పార్టీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుని స్థాయికి ఎదిగారు. రాష్ట్రపతిగా అభ్యర్థిగా ముర్మునే తొలి ఆదివాసీ మహిళ కావడం మ‌రో విశేషం. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే సంఖ్య‌బ‌లం ప‌టిష్టంగా ఉంద‌ని, దానికి బీజేడీ లేదా వైసీపీ వంటి పార్టీల బ‌లం ఉంటే గెలుపు ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

ఇక.. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు జులై 18న పోలింగ్ జరగనుంది.

By admin