రేటింగ్ : 3/5
నటీనటులు: బ్ర‌హ్మానందం, స్వాతి, స‌ముద్రఖ‌ని, దివ్యవాణి, ఉత్తేజ్, దివ్య శ్రీపాద, వికాస్ ముప్ప‌ల, రాహుల్ విజ‌య్‌, శివాత్మికా రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, శ్రీవిద్య, ‘మిర్చి’ హేమంత్ త‌దిత‌రులు
సాహిత్యం : కిట్టూ విస్సాప్రగడ
ఛాయాగ్రహణం: రాజ్ కె. నల్లి
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు: అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు
రచన, దర్శకత్వం: హర్ష పులిపాక
విడుదల తేదీ: డిసెంబర్ 9, 2022

ఒకటి కంటే ఎక్కువ కథల్ని కలిపి సినిమా తీస్తే? దాన్ని యాంథాలజీ అంటారు. తాజాగా విడుద‌లైన‌ ఆ తరహా సినిమాయే ‘పంచతంత్రం’ (Panchathantram Movie). బ్రహ్మానందం, సముద్రఖని, దివ్యవాణి, ఉత్తేజ్ వంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు స్వాతి రెడ్డి, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, నరేష్ అగస్త్య, వికాస్ ముప్పల, శివాత్మికా రాజశేఖర్ వంటి యంగ్‌స్టర్స్ నటించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మరి సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

– అశోక్ ద‌య్యాల‌

కథలు:

బ్రహ్మానందం వేద‌వ్యాస్ అనే కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అవుతాడు. తండ్రి ఇంట్లో సంతోషంగా ఉండాలని కుమార్తె రోషిణి (స్వాతి) కోరిక. స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీలకు తండ్రి వెళతానంటే నిరుత్సాహపరుస్తుంది. కెరీర్ అంటే ఇరవైల్లోనేనా, అరవైల్లో కూడా మొదలు పెట్టొచ్చనే మనిషి వేదవ్యాస్. అమ్మాయి మాటను కాదని మరీ పోటీలకు వెళతాడు. పంచేద్రియాలు థీమ్‌తో ఐదు కథలు చెబుతారు. 5 కథలు చెబుతాడు. దానికి పంచేంద్రియాలు అని పేరు పెడతాడు. దృశ్యం, రుచి, స్పర్శ, వాసన, వినికిడి అంశాల ఆధారంగా ఈ ఐదు కథలు సాగుతాయి.
మ‌రి వేదవ్యాస్ గెలిచాడా? లేదా అన్న‌ది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

మొదటి కథ (దృశ్యం):
విహారి (నరేష్ అగస్త్య) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పని ఒత్తిడి కారణంగా కొన్ని విషయాల్లో అసహనం, ఆగ్రహానికి లోనవుతాడు. సముద్రానికి, అతడికి ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో మన కళ్ళకు కనిపించే దృశ్యం ఎటువంటి పాత్ర పోషించింది? అనేది తెరపై చూడాలి.

రెండో కథ (రుచి):
సుభాష్ (రాహుల్ విజయ్) కి పెళ్లి గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్న ఈతరం యువకుడు. కొన్ని సంబంధాలు చూసి రిజెక్ట్ చేస్తాడు. కుమారుడికి సరైన సంబంధం చూడలేకపోతున్నాని తల్లి బాధపడుతుంటే… త‌ర్వాత ఏ సంబంధం వచ్చినా చేసుకుంటానని చెబుతాడు. అప్పుడు లేఖ (శివాత్మికా రాజశేఖర్) వాళ్ళింటికి వెళతాడు. తొలి పరిచయంలో అమ్మాయితో ఏం మాట్లాడడు. మాట్లాడేది ఏమీ లేదంటాడు. పెళ్లి సంబంధం ఓకే అవుతుంది. ఆ తర్వాత లేఖ నుంచి సుభాష్‌కు ఫోన్ వస్తుంది. అప్పుడు ఏమైంది? ఈ కథలో రుచి ఎటువంటి పాత్ర పోషించింది? అనేది తెరపై చూడాలి.

మూడో కథ (వాస‌న‌) :
రామనాథం (సముద్రఖని) బ్యాంకులో పనిచేసి రిటైర్ అవుతారు. భార్య (దివ్యవాణి), ఆయన… ఇంట్లో ఇద్దరే ఉంటారు. నెలలు నిండిన కుమార్తె, అల్లుడు వేరే చోట ఉంటారు. రామనాథం ముక్కుకు ఏదో వాసన వస్తుంది. అదేంటి? ఆ వాసన ఆయనకు మాత్రమే ఎందుకు వస్తుంది? భార్యకు ఎందుకు రావడం లేదు? అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

నాలుగో కథ (స్పర్శ):
శేఖర్ (వికాస్ ముప్పాల) భార్య దేవి (దివ్య శ్రీపాద) ప్రెగ్నెంట్. ఆమెకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. దాంతో ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకోమని శేఖర్ తండ్రి సలహా ఇస్తాడు. కడుపు వల్ల వ్యాధి వచ్చిందని అబార్షన్ చేయించుకోమని దేవి తల్లి చెబుతుంది. అప్పుడు శేఖర్, దేవి ఏం చేశారు? స్పర్శ ఎలాంటి పాత్ర పోషించింది? అనేది తర్వాత కథ.

ఐదో కథ (వినికిడి):
లియా అలియాస్ చిత్ర (స్వాతి రెడ్డి) చెప్పే కథలకు చిన్నారుల్లో చాలా మంది అభిమానులు ఉంటారు. ఓ డ్రైవర్ (ఉత్తేజ్) పదేళ్ళ కుమార్తె వారిలో ఒకరు. అయితే… ఆ కథలు, ధ్వని (వినికిడి) వాళ్ళతో పాటు కుటుంబ సభ్యుల జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది? అనేది మిగతా కథ.

విశ్లేషణ:
మన చుట్టూ సమాజంలో చూసే సన్నివేశాలు, దృశ్యాలను కొన్ని చిత్రాలు మన ముందుకు కొత్త కోణంలో తీసుకు వస్తాయి. అటువంటి కోవలోకి వచ్చే సినిమా ‘పంచతంత్రం’. ఇందులో మనకు ఐదు వేర్వేరు కథల్ని చూపించారు. ఆ కథల నేపథ్యాలు కూడా వేర్వేరు. కానీ, ఏదో ఒక సందర్భంలో అటువంటి కథలు వినడమో, చూడటమో జరిగి ఉంటుంది.

తొలి కథ విషయానికి వస్తే… కొత్తగా ఏమీ అనిపించదు. ప్రేక్షకుడిపై ఎటువంటి ప్రభావం చూపించదు. అందులో తాను చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్ట‌ర్ సూటిగా చెప్పడంలో ఫెయిల‌య్యార‌నే చెప్పాలి. రెండో కథలో చెప్పిన విషయం కొత్తది కాదు. కానీ, చెప్పిన తీరు బావుంది. ఆ కథలో సంభాషణలు ఆకట్టుకుంటాయి. జీవిత భాగస్వామికి విలువ ఇవ్వాలని, చిన్న చిన్న విషయాల్లో ఆనందం ఉంటుందని చెప్పారు. మూడో కథ మొదలైన తర్వాత, విశ్రాంతికి ముందు సినిమాలో వేగం పెరిగింది. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ తర్వాత ఏం జరుగుతుందో? అనే ఆసక్తి కలిగిస్తాయి. 4, 5 కథలు ప్రేక్షకుల్ని పూర్తిగా దర్శకుడి ప్రపంచంలోకి తీసుకెళతాయి.

ఫస్టాఫ్‌లో రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా హర్ష పులిపాక ప్రభావం చూపిన సీన్‌లు తక్కువ. డ్రామా కూడా అంత‌గా పండలేదు. అస‌లు టాలెంట్ చివరి రెండు కథల్లో కనిపించింది. చాలా పరిణితి చూపించారు. ‘అడిగితే పోయాలేదమ్మా ప్రాణం… తీసే హక్కు మాకు లేదు’, ‘వదులుకోవడం ఎంత సేపు? క్షణం పట్టదు’ వంటి మాటలు ఆ సన్నివేశాల్లో వింటున్నప్పుడు హృదయాన్ని తాకుతాయి. మనసుల్లో ముద్ర వేసుకుంటాయి. పాటలు, మాట‌లు, సాహిత్యం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. ఇటువంటి సినిమాల‌ను నిర్మించాలంటే అభిరుచి కావాలి. అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా సినిమా నిర్మించారు.

నటీనటులు:
బ్రహ్మానందం క‌నిపించ‌గానే కామెడీ అనుకుంటారు ప్రేక్ష‌కులు. కానీ ఇందులో భిన్నం. వేదవ్యాస్‌గా బ్రహ్మానందం నవ్వించలేదు. ప్రేక్షకులు ఆలోచించేలా చేశారు. నటుడిగా తనలో మరో కొత్త కోణం చూపించాడు. మెప్పించాడు. ఈ ‘పంచ తంత్రం’లో అసలైన హీరోలు స్వాతి, దివ్య శ్రీపాద. పెళ్లి తర్వాత నటనకు చిన్న విరామం ఇచ్చిన స్వాతి… మళ్ళీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

స్వాతి నటన చూస్తే.. గ్యాప్ ఇచ్చినట్లు అనిపించదు. ఆమె నవ్వు మన మనసుల నుంచి చెరగదు. బహుశా… స్వాతి నవ్వుతుంటే కొందరికి కన్నీళ్లు కూడా రావచ్చు. ఆ సీన్‌ల‌లో అంత డెప్త్ ఉంది. ఆ నవ్వులో బాడీలో మనకు అందించే సహకారం కంటే సంకల్పం గొప్పదని సందేశం ఉంది. ఆ కథలో ఉత్తేజ్ నటన కూడా ఆకట్టుకుంటుంది. దేవి పాత్రలో దివ్య శ్రీపాద మరోసారి నాచుర‌ల్ యాక్టింగ్‌తో ఆకట్టుకోవడం ఖాయం. ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తారు. వికాస్ కూడా సహజంగా నటించారు. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ విజయ్‌ను చూస్తే ఈతరం యూత్‌ వలే ఉన్నారు. క్యారెక్టర్‌లో మెచ్యురిటీని శివాత్మిక చక్కగా క్యారీ చేశారు. సముద్రఖని, దివ్య వాణి, నరేష్ అగస్త్య, శ్రీవిద్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

సినిమాగా చూస్తే… ‘పంచ తంత్రం’లో ప్రారంభం చాలా సాదాసీదాగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు ఉంటాయి. కొందరికి ఓటీటీలో వెబ్ సిరీస్ చూసినట్టు కూడా అనిపించవచ్చు. సెకండాఫ్‌లో స్వాతి, దివ్య శ్రీపాద తమ నటనతో బరువెక్కిన గుండెతో బయటకు వచ్చేలా చేశారు. వాళ్ళిద్దరి కథలు హృద్యంగా సాగాయి. భావోద్వేగాలు బలంగా పండాయి. చివరకు, చక్కటి అనుభూతి పంచాయి. వీకెండ్ ఓ సారి చూడొచ్చు. క్లీన్ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీతో కలిసి చూడద‌గిన సినిమా.

– అశోక్ ద‌య్యాల‌

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV & APP

 

By admin