◉ రాహుల్ ను కలిసేందుకు అవకాశం కల్పించిన బతుకమ్మ వేడుక 

గల్ఫ్ బాధితులను, చెరుకు రైతులను భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు నడిచేందుకు నిర్వహణ కమిటీ ఆహ్వానించింది. ఇటీవల గల్ఫ్ కార్మికులు, చెరుకు రైతులు కలిసి తమ డిమాండ్ల సాధన కోసం… జగిత్యాల జిల్లా ముత్యంపేటలో దుబాయి బుర్జ్ ఖలీఫా నమూనాతో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్ర నిర్వహణలో ప్రధాన భూమిక పోషిస్తున్న సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కమిటీలో ఈ విషయం చర్చకు వచ్చింది. గల్ఫ్ బాధితులను, చెరుకు రైతులను భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు నడిచేందుకు నిర్వహణ కమిటీ ఆహ్వానించింది. ఆదివారం రోజున మెదక్ జిల్లా అల్లాదుర్గ్ లో ఉదయం రాహుల్ గాంధీ తో గల్ఫ్ కార్మిక నాయకుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి తోపాటు ఇద్దరు గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులు నడుస్తారు.

జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్ కు చెందిన దళితుడు బచ్చల రాజనర్సయ్య షార్జాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య బచ్చల జమున తన బాధలను రాహుల్ తో పంచుకోనున్నది.  నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం కౌట్ల (కె) గ్రామానికి చెందిన ఆదివాసీ మూడ అశోక్ అబుదాబిలో గుండెపోటుతో చనిపోయాడు. మృతుని భార్య మూడ లక్ష్మి తన 10 నెలల పసిపాపతో రాహుల్ కు తన కష్టాలను వివరించనున్నది.

సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునరుద్దరణ ఉద్యమకారుడు చెన్నమనేని శ్రీనివాస రావుతో పాటు ఇద్దరు చెరుకు రైతులు రాహుల్ తో నడుస్తారు. జగిత్యాల జిల్లా వెంపేట కు చెందిన చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి, మాల్లాపూర్ కు చెందిన చెరుకు రైతు న్యావనంది లింబయ్య బృందం తెలంగాణాలో మూతబడ్డ చెరుకు ఫ్యాక్టరీలు, చెరుకు రైతుల సమస్యలను రాహుల్ కు వివరించనున్నారు.

By admin