రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాటపర్వం’ సినిమా విడుదల తేదీ మారింది. అనుకున్న తేదీ కన్నా ముందే ప్రేక్షకుల ముందుకురాబోతుంది. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం ఈ ప్రకటన చేసింది. గతేడాదే విడుదలకావాల్సిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జులై 1న రిలీజ్‌ చేస్తున్నామంటూ చిత్ర బృందం ఇటీవల చెప్పింది. అనూహ్యంగా ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించి, అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. జూన్‌ 17న ఈ సినిమా విడుదలకాబోతుంది. అదే రోజు ‘గాడ్సే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యదేవ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. మరోవైపు, అదే రోజు విడుదలకావాల్సిన రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రం వాయిదా పడింది.

తెలంగాణలో 1990 దశకంనాటి నక్సలైట్‌ ఉద్యమాల స్ఫూర్తితో రూపొందిన ‘విరాటపర్వం’ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్‌, ఎస్‌ఎల్‌వీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి. ప్రియమణి, నవీన్‌చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించారు. కామ్రేడ్‌ రవన్నగా రానా, వెన్నెలగా సాయి పల్లవి కనిపించనున్నారు.

By admin