• పెద్దపల్లి లేదా వరంగల్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సి ఉపకులాలకు కేటాయించాలి.
  • దళిత జనాభాలో 35 శాతం ఉన్న ఉపకులాలకు రాజకీయ పదవుల కేటాయింపులో తీవ్ర అన్యాయం, పదవులన్నీ మాల మాదిగలకేనా?
  • ఇన్నాళ్లుగా పదవులనుభవించిన మాల మాదిగలు రిజర్వుడు స్థానాలను వదిలి రాజకీయంగా వెనుకబడిన ఉపకులాలకు అవకాశం ఇచ్చి జనరల్ స్థానాల్లో పోటీచేయాలి.
  • కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి.
  • కడియం శ్రీహరికి ఎస్సీ ఉపకులాలతో ఎలాంటి సంబంధం లేదు.

హైదరాబాద్ : దళితుల్లో 35 శాతం జనాభా కలిగి అత్యంత వెనుకబడ్డ ఉపకులాలకే పెద్దపల్లి లేదా వరంగల్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 63 లక్షల దళిత జనాభా ఉంటే అందులో మాదిగలు 25 లక్షలు, మాల కులస్తులు 17 లక్షల జనాభా ఉంటే మిగతా ఉపకులాలు 22 లక్షల జనాభాను కలిగి ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ,ఎస్సీ కమిషన్ మొదలైన రాజ్యాంగబద్ద పదవులన్నీ మాల, మాదిగలే అనుభవించారని అన్నారు.

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాల, మాదిగలకంటే ఎస్సీ ఉపకులాలదే మెజారిటీ జనాభా కలిగి ఉన్నారని అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడి స్థానాన్ని ఉపకులాలకు కేటాయిస్తే గెలిపించి తీరుతామన్నారు.

వరంగల్ స్థానంలో కూడా ఉపకులాల జనాభా అధికంగా ఉందని ఇక్కడినుండి కూడా ఉపకులాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేసారు. ఇన్నాళ్లుగా పదవులనుభవించిన మాల మాదిగలు రిజర్వుడు స్థానాలను వదిలి రాజకీయంగా వెనుకబడిన ఉపకులాలకు అవకాశం ఇచ్చి జనరల్ స్థానాల్లో పోటీచేయాలన్నారు.

కడియం శ్రీహరి ఈనాటికి తాను మాదిగననే చెప్పుకున్నారని ఆయనకు మాఉపకులాలతో ఎలాంటి సంభందం లేదని అయన కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయనకు టికెట్ ఇవ్వకూడదని

 నిజమైన ఉపకులాల నాయకునికే కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని కోరారు. ఉపకులాలకు టికెట్ కేటాయించని పక్షంలో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించుటకు ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని, గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, కులధ్రువీకరణ పత్రాలు ఆర్డీవో ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని,

ఎస్సీ కమిషన్ లో కూడా ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని కావున ఎస్సీ కమిషన్ ఛైర్మెన్ పదవి ఉపకులాలకు కేటాయించాలని లేదా ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇస్తే ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో ఇరువైఐదు లక్షల జనాభా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుందని లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామన్నారు.

🪩

 

By admin