ఆకాశంలో ఒక ‘తార‌’..
మ‌న కోస‌మొచ్చి సూపర్ ‘స్టార్’ అయ్యింది..
దాదాపు అర‌శ‌తాబ్దం తెలుగు తెర‌పై దేదీవ్య‌మానంగా వెలిగింది..
ఆ సూప‌ర్ ‘స్టార్‌’కు నివాళి అర్పిస్తూ…
– స్వామి ముద్దం

తెలుగు సినీ పరిశ్రమలో ఆయనో సాహసి.. కదిలే బొమ్మలను మరింత వేగంగా కదిలించిన ఘనుడు. అపజయాలకు వెరవని ధీరోధాత్తుడు.. విజయాలకు పొంగిపోని వినమ్రుడు. హీరోకు అచ్చమైన నిర్వచనం.. ఆయనో జేమ్స్‌బాండ్‌.. ఆయనో గూఢచారి.. ఆయనే సూపర్‌ స్టార్‌ కృష్ణ.

సూపర్‌స్టార్‌ కృష్ణ అంటే ఒక సంచలనం. కృష్ణ నిత్యనూతన శక్తి. ఏటికి ఎదురీది విజయతీరాలకు చేరడం, ప్రయోగాలతో ఫలితాలు అందుకోవడం అయనకే తెలుసు. ఎన్ని అపజయాలు ఎదురైనా అలసిపోని ధీరుడు కృష్ణ. తేనేమనసులు సినిమాతో ప్రారంభమైన ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రేక్షక హృదయాల్లో నిరంతరం ప్రతిధ్వనించే డైలాగ్‌ డెలివరీతో, ఉర్రూతలూగించే నటన చాతుర్యంతో, అన్ని తరహా పాత్రల్ని, అన్ని తరాల వారు మెచ్చేలా పోషించగల నటుడు కృష్ణ. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ల తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించిన సెకండ్‌ జనరేషన్‌ హీరో కృష్ణ. తేనేమనసులుతో ఏకంగా హీరో అయిపోయి.. ముచ్చటగా మూడో సినిమా గూఢచారి 116తో అభిమానులను సంపాదించుకున్నాడు నటశేఖరుడు.

తెలుగు తెర మీద అనేక ప్రయోగాలు చేసి సక్సెస్‌ సాధించాడు కృష్ణ. తెలుగులో మొట్టమొదటగా రంగుల్లో తీసిన సాంఘిక చిత్రం తేనె మనసులే. తెలుగు సినిమాల్లో మొట్టమొదటి సారిగా గూఢాచారిని పరిచయం చేసిందీ కృష్ణనే. కౌబాయ్‌ కూడా ఆయనే. కలర్‌ స్కోపును తెచ్చిందీ ఆయనే. సెవంటీ ఎంఎం ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా కృష్ణే. తెలుగు సినిమాలకు డిష్యూం డిష్యూం నేర్పింది కూడా కృష్ణే. ఖర్చుకు వెనుకాడకుండా భారీ సినిమాలు తీయడం ఆయనకు అలవాటు. లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు తెలుగు వాళ్లకు అందించాలన్న తపన సూపర్‌స్టార్‌ది. సొంత బ్యానర్‌ పద్మాలయ ఫిలింస్‌ బ్యానర్‌లో తీసిన మోసగాళ్లకు మోసగాడు సినిమా సెన్సేషనల్‌ హిట్‌ అయింది. ఈ సినిమా ఇంగ్లీషు, తమిళం, హింది.. ఇలా అన్ని భాషల్లోకి డబ్‌ అయింది. అన్ని చోట్ల హిట్టే.

బాపు డైరెక్షన్లో వచ్చిన సాక్షి సినిమాతో విజయనిర్మలతో మొదటిసారి జత కట్టాడు కృష్ణ. అప్పుడు మొదలైన ఆ కాంబినేషన్‌ దశాబ్దాల తరబడి సాగింది. యాభై చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. వాటిలో ముప్ఫై సినిమాలు విజయనిర్మల దర్శకత్వంలో వచ్చినవే. తరవాత కృష్ణ-విజయనిర్మల పరిచయం ప్రణయంగా మారి, తిరుపతిలో పెళ్ళి జరిగింది.

ఇక సూపర్‌‌స్టార్‌ సినిమాల్లో చెప్పుకోవాల్సిన సెన్సేషనల్‌ సినిమా అల్లురి సీతరామరాజు. అది కృష్ణకు వందో సినిమా. కృష్ణ నట జీవితంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇండస్ర్టీ నుంచి నెగటివ్‌ రెస్పాన్స్‌ వచ్చినా.. ఎవరెన్ని కామెంట్లు చేసినా పట్టించుకోకుండా ధైర్యంగా ఆ సినిమా తీశాడు. అల్లూరి సీతరామరాజుతో తిరుగులేని హిట్‌ సాధించాడు కృష్ణ.

సీతారామరాజు తర్వాత వచ్చిన సినిమాలు కృష్ణకు అనుకున్న విజయాలు తీసుకురాలేదు. అన్నీ ఫ్లాపులే. పదేళ్ల పాటు విసుగు విరామం లేకుండా రోజుకు మూడు షిప్టులు పని చేసిన కృష్ణకు సినిమాలు లేకుండా పోయాయి. సొంత బ్యానర్‌లో వచ్చిన పాడిపంటలు మళ్లీ కృష్ణకు కలిసివచ్చింది. అప్పటి నుంచి ఇక తిరుగులేని హీరో అయ్యాడు. కృష్ణ డైలాగ్‌ డెలివరీ కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈనాడు, కంచుకాగడా, అగ్నిపర్వతం వంటి సినిమాల్లో కృష్ణ చెప్పిన డైలాగులు తూటాల్లా పేలాయి. ”ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ.. ” అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా ‘సింహాసనం’. సూపర్‌స్టార్‌ కృష్ణ స్వీయదర్శకత్వ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ సూపర్‌హిట్‌ అయింది. తెలుగు సినిమాకు సెవంటీ ఎంఎంను పరిచయం చేసిన సింహాసనం విడుదలై 36 ఏళ్ళు దాటింది.

1990నాటికి కథానాయకుడిగా కృష్ణ ప్రభావం తగ్గింది. అయితే వారసుడి సినిమాలో కొత్త అవతారంలో తన సత్తా చాటుకున్నారు. యమలీల సినిమాలో ఓ సాంగ్‌కు వెరయిటీ స్టెప్పులేసి తన అభిమానులు విపరీతంగా అలరించాడు. పచ్చని సంసారం, నంబర్‌ వన్‌, అమ్మదొంగ వంటి సినిమాలతో మరోసారి హీరోగా బిజీ అయ్యారు. హీరోగా అనేక విజయాలు సాధించిన కృష్ణ.. ఇప్పుడు తనయుడు మహేష్ సాధిస్తున్న విజయాలు చూసి పుత్రోత్సాహన్ని అనుభవిస్తున్నాడు. 46 ఏళ్ళ నట ప్రస్థానంలో కృష్ణ 360 సినిమాల్లో నటించారు. అందులో హీరోగా 340 సినిమాలు నటించిన రికార్డు సూపర్‌స్టార్‌ సొంతం.

సూపర్‌స్టార్‌, నటశేఖర బిరుదులతో పాటు అనేక అవార్డులు కృష్ణను వరించాయి. అలుపెరగని సినీప్రయాణంలో అన్నిరకాల పాత్రలు పోషించి అలరించారు కృష్ణ.

 

By admin