◉ గల్ఫ్ ప్రవాసులతో ఆన్ లైన్ లో ఆత్మీయ సమావేశం
సుదూర తీరాలలో గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రవాసీయులతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి ఆన్ లైన్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. జీతేగా ‘ఇండియా’ – బనేగా భారత్ నినాదంతో… రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఈ పార్లమెంటు ఎన్నికల్లో ‘ఇండియా కూటమి’ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్న ‘భారత్ జోడో అభియాన్’ అనే పౌర సంఘాల జాతీయ వేదిక ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సామాజిక ఉద్యమకారిణి కవిత కారుగంటి, వలస కార్మిక నేతలు స్వదేశ్ పరికిపండ్ల, మంద భీంరెడ్డి సమావేశ అనుసంధానకర్తలుగా వ్యవహరించారు.
ఈ సందర్బంగా టి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ళలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటెల రాజేందర్, టి. హరీష్ రావు లు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లోనే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టారని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును తమ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.
కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ ఎన్నారై లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని టి. జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు సేవలను గల్ఫ్ దేశాలతో సహా మలేసియా, సింగపూర్ తదితర దేశాలలో పనిచేసే కార్మికులకు విస్తరిస్తామని, విదేశాల నుంచి వాపస్ వచ్చిన కార్మికుల పునరావాసం గురించి శ్రద్ధ తీసుకుంటామని అన్నారు. గల్ఫ్ ప్రవాసుల పిల్లలకు విద్యా సంస్థల అడ్మిషన్లలో కొన్ని సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. సమగ్ర ప్రవాసీ విధానం (ఎన్నారై పాలసీ) రూపొందిస్తామని జీవన్ రెడ్డి అన్నారు.
సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, కోటపాటి నరసింహ నాయుడు, ఖాజా నిజాముద్దీన్, గాజెంగి రంజిత్, అల్లె పాండురంగ, మ్యాకల రాజు, సయిండ్ల రాజిరెడ్డి, జక్కుల చంద్ర శేఖర్, నవీద్ దస్తగిరి, వడ్లకొండ గోవర్ధన్, భైర దేవ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బీరెల్లి తిరుమల్ రావు, సంతోష్ గౌడ్, తోట ధర్మేందర్, లక్కవత్తుల గంగాధర్, లక్ష్మణ్, సౌందర్య రామ్, యాతం స్వామి, రాజేష్, పల్క ఆనందం, ఎస్వీ రెడ్డి, మెంగు అనిల్, తేలు నరేష్, తొగర్ల సంజీవ్, జక్కుల ప్రసాద్, కంబాలపల్లి శాంత, పెంకుల రాజేశ్వర్, తేలు భాషా తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్, సింగపూర్, మలేసియా దేశాలలోని తెలంగాణ ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టి. జీవన్ రెడ్డి శాసన సభలో, శాసన మండలిలో గల్ఫ్ కార్మికుల గొంతుగా ఉన్నారని, నిజామాబాద్ ఎంపీగా గెలిచి జాతీయ స్థాయిలో పార్లమెంటులో తమ సమస్యలను లేవనెత్తాలని సమావేశంలో పాల్గొన్న పలువురు కోరారు.