హైదరాబాద్‌: వినాయక న‌వ‌రాత్రుల సందర్భంగా ఖైరతాబాద్‌ మహా గణపతిని ‘వేదవ్యాస్‌’ సినిమా చిత్రబృందం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. నిర్మాత, మాజీ శాసనసభ్యుడు, కె.పి.ఆర్‌.ఐ.టి విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి, చిత్ర సమర్పకుడు కె. అచ్చిరెడ్డి, హీరో పిడుగు విశ్వనాథ్‌ తదితరులు మహా గణపతిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

సాయిప్రగతి ఆర్ట్స్‌ పతాకంపై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బహుముఖ ప్రజ్ఞాశాలి యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కె. అచ్చిరెడ్డి చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా ‘వేదవ్యాస్‌’ సినిమా బృందమంతా ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’’ అని తెలిపారు. అనంతరం ఖైరతాబాద్‌ వినాయక మండప నిర్వాహకులకు చెక్కును అందజేశారు.

దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘వేదవ్యాస్‌ సినిమా బృందంతో కలిసి మహా గణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ప్రజలందరిపై ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చిత్ర సమర్పకుడు కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘వేదవ్యాస్‌ అద్భుతంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది. మహా గణపతి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో పిడుగు విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత తరానికి, ముఖ్యంగా జెన్‌-జీ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ‘వేదవ్యాస్‌’ రూపొందుతోంది. ఏఐ జనరేషన్‌లోనూ వేదాలు, మన సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యానికి ప్రాధాన్యం ఇస్తూ కథ సాగుతుంది. విఘ్నేశ్వరుని ఆశీస్సుల వల్లే ఇంతటి గొప్ప దర్శకుడితో నా తొలి చిత్రంలోనే పనిచేసే అవకాశం లభించింది. వచ్చే ఏడాది నాటికి నన్ను మంచి హీరోగా నిలబెట్టాలని మహా గణపతిని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్ర సహ నిర్మాత మేడపాటి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు తదితరులు పాల్గొని మహా గణపతిని దర్శించుకున్నారు.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *