• ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ ‘కమిటీ’ ప్రకటన సమస్యను పక్కదారి పట్టించడానికే.
  • ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ ఉపకులాల డిక్లరేషన్ అమలు చేయాలి
  • ఎస్సీ వర్గీకరణ జరిపి 57 ఉప కులాలన్నిటిని “A” కేటగిరీలో చేర్చాలి.
  • రిజర్వేషన్లలో సమాన వాటా మా జాతుల హక్కు, మేమెంతో మాకు అంత.
  • ఉపకులాల సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో ‘ఎస్సీ 57 ఉపకులాల విశ్వరూప మహాసభ’

– ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి.

హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): హైదరాబాద్ లో జరిగిన “మాదిగల విశ్వరూప మహాసభ”లో ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణపై మరో కమిటీ వేస్తామని ప్రకటించడాన్ని ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమని, వర్గీకరణలో ఉపకులాలకు అన్యాయం చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలను ఏకం చేసి విశ్వరూప మహాసభను ఏర్పాటుచేసి బీజేపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతామని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశంమోచి హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల జనాభా ఉన్నప్పటికీ రిజర్వేషన్ ఫలాలు పొందడంలో దళితుల్లో అత్యంత వెనుకబడ్డ ఉపకులాలు తీవ్ర అన్యాయానికి గురిఅవుతున్నాయని అన్నారు. నేడు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో “ఎస్సీ వర్గీకరణ పై ఎస్సీ 57 ఉపకులాల డిక్లరేషన్” ను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితులలో అత్యంత వెనుకబడేయబడ్డ 57 ఉపకులాలకు ఇంకా రాలేదని అన్నారు. దళితులకు రాజ్యాంగ బద్ధంగా దక్కవలసిన రిజర్వేషన్ ఫలాలు తమ కులాలకు ఈనాటికి దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణ అవసరమైన కులాలు కేవలం ఉప కులాలు మాత్రమేనని మాల మాదిగలకు వర్గీకరణ అవసరమేలేదని కావున ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టి అందులో అత్యంత వెనుకబడ్డ 57 దళిత ఉపకులాలన్నిటిని ” A ” కేటగిరీలో చేర్చి మా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని కేటాయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈనెల 11న హైదరాబాదులో జరిగిన మాదిగల విశ్వరూపసభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడుతూ ఈ సమస్య ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని అంటూనే ఈ సమస్య పరిష్కారం కోసం త్వరలో ఒక కమిటీ వేస్తామని ప్రకటించడాన్ని ఈ సమస్యను పక్కదారి పట్టించే చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇదే సమస్యపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉషామెహర కమిషన్ 2008లో తమ నివేదికను ప్రభుత్వానికి ఇస్తూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళితులలో మాల,మాదిగ కులాలు మాత్రమే అభివృద్ధి చెందాయని మిగతా 57 కులాలు విద్యా, ఉద్యోగ,ఉపాధి, రాజకీయంగా, సామాజికంగా అత్యంత వెనుకబడి ఉన్నాయని తేల్చి చెప్పింది. వీరి సమస్య పరిష్కారానికి ఎస్సీలను వర్గీకరించాలని అందుకు రాజ్యాంగం లోని 341 ఆర్టికల్ సవరించాలని సూచించింది. ఆనాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ కమిటీ నివేదికను అమలు చేయలేదు పైగా ఇప్పుడు మరొక కమిటీ వేస్తామనడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులలో అత్యంత వెనుకబడిన ఉపకులాల అభివృద్ధికి పాటుపడకపోగా మాల మాదిగలు కూడా మా ఉపకులాల అణచివేతకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

2020లో సుప్రీంకోర్టు ఎస్సీవర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవాలని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునివ్వగా, ఈ కేసులో మాదిగలు గతంలో అమలు జరిగిన విధంగా ఎస్సీ వర్గీకరణ జరిగే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ వేయడాన్ని ఎస్సీ ఉపకులాలుగా తప్పుపడుతూ ఎస్సీ ఉప కులాలన్నింటిని A వర్గంలోచేర్చి న్యాయంచేయవలసిందిగా సుప్రీంకోర్టులో కేసువేసినట్లు తెలిపారు.
ఎందుకంటే గతంలో 2000 నుంచి 2004 సం. వరకు అమలు జరిగిన ఎస్సీ వర్గీకరణ అశాస్త్రీయంగా జరగడం వల్ల మాల మాదిగ కులాలే అభివృద్ధి చెందారు తప్ప మిగతా 57 ఉప కులాల వారు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

ఈ వర్గీకరణలో A కేటగిరి లో 11 కులాలు ఉండగా, B కేటగిరిలో మాదిగల తో సహా 18 కులాలు, C కేటగిరి లో మాలలతో పాటు 24 కులాలు, D కేటగిరిలో 6 కులాలను చేర్చారు. దీనివల్ల C కేటగిరిలో మాలలతో పాటు ఉన్న ఉపకులాలు విద్యలో వెనుకబడి బడిమెట్లు కూడా ఎక్కని స్థితిలో ఉండగా ఇందులోని 24 ఉపకులాలకు దక్కవలసిన రిజర్వేషన్లు మాలలకే దక్కాయి ఇక B కేటగిరిలో మాదిగల తో పాటు ఉన్న 18 ఉప కులాలు అన్ని రంగాలలో అత్యంత వెనుకబడి ఉండడం వల్ల వీరి రిజర్వేషన్ ఫలాలను కూడా మాదిగలే అనుభవించారు. పైగా A మరియు D కేటగిరీలో ఉన్న ఉపకులాలు అత్యంత వెనుకబడి ఉండడం వల్ల ఈ రెండు వర్గాల ప్రయోజనాలు కూడా అందులో నిబంధనల ప్రకారం B కేటగిరిలో ఉన్న మాదిగల పొందారు. దీనిద్వారా గతంలో అమలు జరిగిన ఎస్సీవర్గీకరణ వల్ల ఎవరు ప్రయోజనం పొందినారో? ఉపకులాల పేరును అడ్డుపెట్టుకొని వర్గీకరణ పేరుతో ఎవరి ప్రయోజనం కోసం ఉద్యమిస్తున్నారో అందరికి అర్థమౌతుంది.
గత 75 సంవత్సరాలుగా సరైన విద్య కూడా అందక , కనీసం బడి మెట్లు కూడా ఎక్కకుండా సంచార జీవనం గడుపుతూ చిన్నచిన్న చేతివృత్తులు చేసుకుంటూ సమాజంలో కనీసం దళితులుగా గుర్తింపబడకుండా ఉండడానికి ఇల్లు సరైన తిండి లేకుండా బిక్షాటన చేస్తూ జీవిస్తున్న 57 ఉపకులాలను ప్రభుత్వంతో పాటు మాల మాదిగ కులాలు ఇంతకాలం మోసం చేశాయని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ పేరుతో 30 సంవత్సరాలుగా మాల మాదిగలు తమ ఆధిపత్య పోరాటాన్ని కొనసాగిస్తూ దళితులలో అన్ని కులాలకు దక్కవలసిన విద్యా,ఉద్యోగ,ఉపాధి,రాజకీయ రిజర్వేషన్ ఫలాలను రెండు కులాల వారే అనుభవిస్తున్నాయని మాల మాదిగ కులాలతో సమాన జనాభాను కలిగిన 57 ఉపకులాలకు ద్రోహం చేస్తున్నారని ఇందుకు ప్రభుత్వాలు కూడా వారికి వత్తాసు పలుకుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు ఏ దళిత నాయకులు ఉపకులాల అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలలో, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఇతర నామినేటెడ్ పదవులలో ఉపకులాలవాటా కోసం పోరాడిన వారు లేరన్నారు. ఎస్సీ ఉప కులాల సమస్యలను వెంటనే పరిష్కరించలేని పక్షంలో రాష్ట్రంలోని 22 లక్షల జనాభా ఉన్న మా ఎస్సీ 57 ఉపకులాలతో త్వరలోనే “ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభను” నిర్వహిస్తామన్నారు.

ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన ఎస్సీ ఉపకులాల డిక్లరేషన్ ను ప్రకటించారు.
1. ఎస్సీ వర్గీకరణ వెంటనే చేపట్టి అత్యంత వెనుకబడ్డ 57 ఉపకులాలన్నింటిని A కేటగిరీలో చేర్చి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని కేటాయించాలి.
2. ఉపకులాలన్నింటికీ కులదృవీకరణ పత్రాలను ఆర్డిఓ ద్వారా కాకుండా జీవో నెంబర్ 11, 2014 ప్రకారం తాసిల్దార్ ద్వారానే ఇవ్వాలి.
3. ఎస్సీ కులాల జనగణన చేపట్టాలి.
4. ఎస్సీ ఉపకులాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తక్షణం 2వేల కోట్లు కేటాయించాలి.
5. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల(ఎస్. డి. ఎఫ్ )ద్వారా ఎస్సీ ఉపకులాల అభివృద్ధికై ప్రత్యేక పథకాలను రూపొందించాలి.
6. మా ఉపకులాల సామాజిక స్థితిగతులు జీవన విధానంపై అధ్యయనం చేయడం కోసం ప్రభుత్వ పరిశోధన సంస్థ ద్వారా సర్వే చేపట్టి విభిన్న కళలు, చేతి వృత్తులపై ఆధారపడ్డ వారిని గుర్తించి వీరి అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.
7. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి లాంటి ప్రభుత్వ పథకాలలో ఎస్సీ ఉపకులాలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చి అర్హులైన అందరికీ అందించాలి.
8. ఉప కులాల విద్యార్థులందరికీ ఎలాంటి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలి.
9. వ్యవసాయంపై ఆధారపడిన ఉపకులాల ప్రజలకు కనీసం ఎకరం భూమి కేటాయించాలి.
10. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ ఎమ్మెల్సీ, ఎస్సీ కమిషన్ పదవులతోపాటు ఎమ్మెల్యే,ఎంపీ స్థానాల్లో ఎస్సీ ఉపకులాలకు మాల, మాదిగలతో సమానవాట కల్పించాలి.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin