అగ్ర‌రాజ్యం అమెరికా రాజ‌కీయాల్లో చరిత్ర సృష్టించిన తెలుగు ఆడపడుచుకు శుభాకాంక్ష‌ల వెల్లువ మొద‌లైంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో విజ‌యం సాధించిన కాట్రగడ్డ అరుణ మిల్లర్‌కు ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న ఇండియ‌న్స్‌తో పాటు తెలుగు ఎన్నారైలు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

(స్వాతి దేవినేని – యూఎస్ఏ ప్ర‌తినిధి):

కాట్రగడ్డ అరుణ మిల్లర్‌ మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గెలిచి, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆమె నిలిచారు. అరుణ‌ది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా వెంట్రప్రగడ. అమ్మ హేమలత. నాన్న కాట్రగడ్డ వెంకట రామారావు ఇంజినీర్‌. ఆయన ఉద్యోగరీత్యా వీళ్లు 1972లో అమెరికాలో స్థిరపడ్డారు. అప్పటికి తనకు ఏడేళ్లు. అరుణ మిస్సోరి యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. వర్జీనియా, హవాయి, కాలిఫోర్నియాల్లో రవాణా ఇంజినీర్‌గా పని చేశారు. 1990లో మేరీల్యాండ్‌ మాంట్‌ గొమెరీ కౌన్సిల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌కి మారారు. స్నేహితుడు డేవ్‌ మిల్లర్‌ని పెళ్లాడారు. మొదట్నుంచీ సామాజిక సేవపై ఆసక్తి. పాఠశాలలు, ఉపాధి, కమ్యూనిటీ కేంద్రాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూశారు. వికలాంగులు, పాదచారులు, సైకిల్‌ నడిపేవారికి అనువుగా ఉండేలా రూపొందించిన కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. పాతికేళ్లు సేవలందించి 2015లో ఉద్యోగ విరమణ చేశారు.

2000లో అమెరికా పౌరసత్వాన్ని పొందిన అరుణ ఆ ఏడాదే మొదటిసారి ఓటు వేశారు. ‘ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. కొంత భావోద్వేగానికీ గురయ్యా’నని చెబుతారు. అయితే తను మద్దతు తెలిపిన అభ్యర్థి ఓడిపోయారు. తర్వాతా అదే పరిస్థితి. దాన్ని తట్టుకోలేక ఆమె కార్యకర్తగా మారారు. డెమొక్రటిక్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. ఆమె చురుకుదనం, పేరు ప్రఖ్యాతులకు మెచ్చి 2010లో మేరీల్యాండ్‌లో డెమొక్రటిక్‌ పార్టీ తరఫున డెలిగేట్‌గా పోటీ చేసే అవకాశమిస్తే ఆమె తిరస్కరించారు. ప్రజాసంక్షేమమే ల‌క్ష్యం కాబ‌ట్టి, రాజ‌కీయాల్లో అది సాధ్యం అవుతుంద‌న్న భర్త మాటలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆమె. తొలి పోటీలోనే గెలిచి, మేరీల్యాండ్‌కు తొలి భారతీయ అమెరికన్‌ డెలిగేట్‌ అయ్యారు. అమెరికాలో పెరిగినా భారతీయ మూలాలను ఎప్పటికీ మరవలేదంటారు ఆమె సన్నిహితులు. మన సంస్కృతి, సంప్రదాయాలంటే ఆమెకు ఎనలేని ప్రేమ. మొదటిసారి గెలిచాక తన రాష్ట్ర గవర్నర్‌ని భారత్‌కి తీసుకొచ్చి పలు వ్యాపార విభాగాల్లో భాగస్వామ్య ఒప్పందాలు కుదిర్చారు. 2014లోనూ రెండోసారి డెలిగేట్‌గా ఎన్నికయ్యారు. రెవెన్యూ, రవాణా మొదలైన కీలక కమిటీల్లో సభ్యురాలయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసిన తొలి మహిళ.. హిల్లరీ క్లింటన్‌ బృందంలో ఈవిడా ఒకరు. చీర, నుదుటిమీద ఎర్రటి బొట్టుతో ప్రపంచ దృష్టీ ఆకర్షించారు అరుణ. 2018లో ప్రతినిధుల సభకు పోటీ చేసి ఓడిపోయారు. తాజా గెలుపుతో మళ్లీ సత్తా చాటారు. బైడెన్‌ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడూ అరుణ చురుగ్గా ప్రచారం చేశారు. అందుకేనేమో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవుల్లో ఉన్నా బైడెన్‌, కమలా హ్యారిస్‌లు ఆమె తరఫున ప్రచారం చేశారు. చదువుకునే హక్కు, పాఠశాలలో ‘లేబర్‌ డే’, పర్యావరణ విధానాల్లో మార్పులు, విచ్చలవిడిగా ఆయుధాల లభ్యత వంటి ఎన్నింటిపైనో ఆవిడ పోరాడారు. తన కృషి ఫలితంగా కొన్ని విధానాలూ రూపొందాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులూ ఆమెకు మద్దతిచ్చారు. 58 ఏళ్ల అరుణని మేరీల్యాండ్‌ వాసులు ‘ఫైర్‌ బ్రాండ్‌’గా అభివర్ణిస్తుంటారు. అరుణ విజ‌యం ప‌ట్ల తెలుగువారు గ‌ర్వ‌ప‌డుతున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గెలిచి, ఆ ఘనత సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆమెకు స్వ‌దేశం నుంచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

By admin