-బీఎస్ రాములు,
బీసీ కమిషన్ మాజీ చైర్మన్BSRAMULU philosophy
బీసీలు ఎన్నికల్లో నిలబడితే ప్రజలకు అంతదాకా ఏంచేసిండో , ఇకముందు ఏంచేస్తడో చెప్పాలి. తన భవిష్యత్ ప్రణాళిక వివరంగా చెప్పాలి. ప్రజలను కలిసి మెప్పించాలె. బీసీ పేరు చెప్పి బీసీగా తనకే ఎందుకు ఓటేయాలో దానివల్ల బీసీ ఓటర్లకు. ఏమేం ప్రయోజనాలో ఎన్నికల ప్రణాళిక రాయాలె. ..ప్రచారం చేయాలె. బీసీ రచయితలు కళాకారులు , జర్నలిస్టులు, బీసీ ఇతర ప్రాంతాల నాయకులతో మీటింగులు పెట్టాలి. బీసీ దూందాం ప్రదర్శనలు పెట్టాలి. మేం బీసీలం, మేం బీసీలనే ఎన్నుకుంటాం అనే స్టిక్కర్లను ఇంటింటికి ఇంటివాల్ల అనుమతితో. అతికియ్యీలె. బీసీల జనాభా లెక్కలు తీయని మీకు ఓటెందుకేయాలె? అని ప్రశ్నిస్తూ కరపత్రాలు పోస్టర్లు వేయాలి. ఇంటింటికి కలువాలె. మహాత్మా జ్యోతిబా ఫూలే సావిత్రిబాయి ఫూలే , అంబేద్కర్ , భారత రాజ్యాంగం గురించిన చిన్నపుస్తకాలు ఒక్కొక్కటి 32 పేజీలు మించకుండ అచ్చేసి ఒక నియోజకవర్గం లో 75 వేల కాపీలు పంచాలె. వాటికి ఇంటికి వంద చందా అడిగి తీసుకోవాలి. మీ పిల్లలు ఏంచదువుతున్నరని తెలుసుకోవాలె.
బీసీ రెసిడెన్షియల్ స్కూలు కాలేజీల చేర్పించే బాద్యతనాది అని వివరాలు రాసుకోవాలి. డబుల్ బెడ్రూం, ఆసరా పధకం, కులవృత్తులకు లక్షదాక బ్యాంకు లోన్ల్లుఇప్పిస్తా అని పేర్లు రాసుకోవాలి. అవి తర్వాత ప్రభుత్వం తరఫున సగం మాఫీ చేపిస్త అని హామీ ఇవ్వాలి. పంద్రాగస్టు నాడు స్వాతంత్ర్యం వచ్చింది గనుక ఆరోజు ఇంట్లో పండుగ చేసుకోవాలి. ఇంటోల్లందరికి ఇరవై ఐదు గజాల చేనేత బట్టలు ఉచితంగా ఇప్పిస్తా ఆ స్కీమ్ తెస్త అని చెప్పాలి. వడ్లోల్లకు హైబ్రిడ్ టేకు చెట్లు పెంచుకునుటానికి వంద ఎకరాలు అడవి/ బంజరు కెటాయిస్తమని హామీ ఇవ్వాలి. కులానికి ఐదారుమందికి అర్హతననుసరించి ఉద్యోగాలు కలిపిస్తాం అని చెప్పాలి. నా నియోజక వర్గం లో ఇంజస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్త. చెరువుల్లో జెల్ది పెరిగే పెద్ద చాపలు పెంచే స్కీమ్ పెడుత. రజకులకు వాషింగ్ మిషిన్లతో దోబీ పార్కు ఏర్పాటు చేస్త. నా నియోజక వర్గం నుండి వలసపోయో వాల్లకు ఐడీ కార్డు ఇస్త. ఎక్కడున్నరో ఎట్లున్నరో ఆపదకు సంపదకు నెలకోసారి తెలుసుకుని రికార్డు రాయిస్త. ఎవరు ఎట్ల చనిపోయినా 18 ఏండ్లుదాటి అరవై ఏండ్ల లోపు వారికి ఆరు లక్షల ఆర్థిక సాయం చేసి అది ఉపాధి కల్పనకు ఉపయోగ పడేట్టు చూస్త. దానికి అదనంగా పది లక్షల లోన్ ఇప్పిస్త. అందుకు 50 వేల కేట్ల మూల ధనంతో బీసీ బ్యాంకు ఏర్పాటు చేస్త . ఇంటికి వెయ్యి రూపాయలు / లేదా ఒక నెల ఆసరా పైసలు అందరి దగ్గర వసూలు చేసి నా నియోజక వర్గంలో ఐదువందల పడకల ఉచిత వైద్య మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేస్త. ఇంటికి రోజుకు కనీసం 500 లీటర్ల నల్ల నీల్లు ఇస్త. యాడాదికి ఒకసారి 26 జనవరి పండుగకు ఒక గ్యాస్ సిలిండర్ నిండ గ్యాస్ ఉచితంగా ఇప్పిస్త. సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భం జనవరి మూడో తేదీన ఆడ పిల్లందరికి ఒక డ్రెస్ రెండు పెన్నులు ఇరవై నోటు బుక్కులు పది మంచి. పుస్తకాలు ఇప్పిస్త. పెద్దవారికి ప్రతి చెబ్బీస్ జనవరి న భారత రాజ్యాంగం సులభంగా అర్థ మయ్యే ప్రతి ఇప్పిస్త. సంవత్సరానికి రెండు సార్ల నియోజక వర్గంలో జాబ్ మేలా లోన్ మేలా ఏర్పాటు చేస్త. ఇల్లలో చేసే పని మనుషులకు , ఆటోడ్రైవర్లకు కూరగాయలు అమ్మేవారికి ఐడీ కార్డులు ఇస్త. పని చేసే అందరికి నా నియోజక వర్గంలో ప్రావిడెంటు ఖాతా ఏర్పాటు చేపిస్త. ప్రతి ఊరిలో పోలీసు స్టేషన్‌కు కౌన్సిలింగ్ సలహా దారులుగా ఐదుగురు ను నియమిస్త. ఆదర్శ గ్రామం వరంగల్ గంగదేవిపల్లె కు తీసుక పోయి చూపించి ప్రతి పల్లె అట్ల ఎదగడానికి కృషి చేస్త. పంటలు , పాలు, కూరగాయల ఉత్పత్తులకు మంచి మార్కెట్లు ఏర్పాటు చేస్త . పది కిలో మీటర్ల లోపే డిగ్రీ కాలేజీ అందుబాటులో కి తెస్త. ఇంకా దూరం ఉంటే వారికి వందరూపాయలకే బస్సు పాస్ ఏర్పాటు చేస్త . హాస్టల్ ఏర్పాటు చేస్త. ఇంటింటికి సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేయిస్త. మూడు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ చేస్త. రెండో పంట ఆరుతడి వ్యాపార పంటలతో అధిక లాభం వచ్చేట్టు చూస్త. ఇంటింటికి కనీసం పది వనరాజ గిరిరాజ కోల్లు పెంచుకునేట్టు చూస్త. ప్రతి పల్లెలో కనీసం ఒకటైన 40 ఫీట్ల రోడ్ ఏర్పాటు చేస్త. అది వీలుకాకపోతే 60 ఫీట్ల బైపాస్ రోడ్ వేయించి కొత్త ఊరు డెవలప్ చేస్త.
వారానికి ఒకసారి ఇంటికి వచ్చి అందరి ఆరోగ్యం గురించి తెలుసుకునే ఏర్పాటు చేస్త. పేదలకు కులాంతర వివాహాలు చేసుకునే వారికి సామూహిక వివాహాలు ఉచితంగా చేపిస్త. తులంమేరకు బంగారు మంగళ సూత్రం ఉంగరాలు ఉచితంగా ఇచ్చి పెళ్లిని రిజిస్టర్ చేయిస్త. గల్ఫ్ కు పోయినవారికి పోయేవారికి రిజిస్టర్ పెట్టి వారి కుటుంబాలకు ప్రత్యేక పథకాలు, వారి డబ్బుకు అధిక వడ్డీ వారికి మంచి హౌజింగ్ బోర్డుతో ఆధునిక సదుపాయాలతో ఇండ్లు , ఇక్కడ బతకడానికి వ్యాపార పారిశ్రామిక , మార్కెట్ రంగాల్లో శిక్షణ ఏర్పాటు చేస్త. ఇలా బీసీలు ఇల్లిల్లు తిరిగి సముదాయించాలి. ఎలక్షన్లకు రెండ్లేల్ల ముందునుండి ప్రచారం చేయాలి. పోటీ చేయదల్చుకున్నవాల్లు గ్రామానికి కనీసం పది మందిని ఎన్నిక చేసుకొని వారి వివరాలు రిజిస్టర్ రాయాలి. వారి కృషి నమోదు చేయాలి. దానిననుసరించి వారిని సర్పంచ్. మెంబర్స్, యంపిటీసీ, జెడ్పీటీసీ, యంపీపీకి ప్రమోట్ చేయాలి. అలా ఒక నియోజకవర్గంలో 120 గ్రామాలుంటే 1200 బీసీ కార్యకర్తలను తయారు చేసుకోవాలి. ప్రతి ఊరిలో ప్రతి బీసీ కులంలో కనీస ముగ్గురునైనా పేరు గుర్తుంచుకుని పలకరించగలగాలి. ఇలా ప్రజల మధ్య పని చేస్తే బీసీలు తప్పక గెలుస్తారు. తక్కువ ఖర్చుతో గెలుస్తారు. ఎన్నికల సమయంలో ఏంచేయాలో మరోసారి చెప్త. ఇవేవీ చేయకుండా గెలవాలనుకుంటే ఇతరులకు బీసీనాయకుల మధ్య తేడా ఏముంటుంది? కనక డబ్బు పెట్టి వారే గెలుస్తారు. కనక నూతన ప్రణాళికలతో బీసీలు ముందుకు సాగాలి గెలవాలి. కూజా కొంగ, నక్క పల్లెం పాయసం కథ తెలుసుకదా! కూజా పాయసం నక్క తాగ లేదు . పల్లెంలో పాయసం కొంగ తాగలేదు. ఇట్లా అగ్రకులాలు చొరలేనివి రూపొందించుకుని మన పాయసం మనమే తాగాలి. ఎదగాలి. గెలవాలి.